http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 14:03 by Unknown   No comments

ఓ మహిళ సరోగసికి ఒప్పుకుంది. మరో మహిళను అమ్మను చేసేందుకు మూడు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. తన కడుపులో శిశువుకు ప్రాణం పోసింది. ఆరునెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఓ ఆస్పత్రిలో ఆమెకు స్కానింగ్‌ తీశారు. ఆమె కడుపులో ఉంది ఆడశిశువని చెప్పేశారు. దాంతో ఒప్పందం కుదుర్చుకున్న దంపతులు మెల్లమెల్లగా సరోగేట్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారు... నగరంలోని స్కానింగ్‌ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు జరగడం లేదన్న అధికారుల ప్రకటనల్లోని వాస్తవాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది.
  • స్కానింగ్‌ సెంటర్ల ఇష్టారాజ్యం
  • నిబంధనలన్నీ బేఖాతర్‌
  • రికార్డులకు దిక్కే లేదు
  • అంతా అనధికారికమే...
  • గ్రేటర్‌లో 2 వేల పైనే సెంటర్లు
  • 1115 సెంటర్లకే రిజిస్ట్రేషన్‌
హైదరాబాద్‌: స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని, అబార్షన్‌ చేయడం అమానుషమని తెలిసినా కొన్ని సెంటర్లు, నర్సింగ్‌హోములు ఈ దందా సాగిస్తున్నాయి. కొంతమంది అధికారులు కొన్ని సెంటర్ల వద్ద ముడుపులు తీసుకుంటూ వాటివైపు కన్నెత్తి చూడడంలేదు. ఖాళీగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాలుగైదు సెంటర్ల మీద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. వైద్యాధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు స్కానింగ్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో సరైన రికార్డులు లేవని తెలుస్తోంది.
 
రెండు వేలపైనే...
గ్రేటర్‌ పరిధిలో రెండు వేలకు పైగా స్కానింగ్‌ సెంటర్లున్నాయి. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం 1115 సెంటర్లు రిజిస్టర్‌ అయ్యాయి. శివారు ప్రాంతాల్లో లెక్కలేనన్ని సెంటర్లు ఉన్నాయి. వాటిపై అజమాయిషీ, నియంత్రణ లేవు. ఆ సెంటర్ల నిర్వాహకుల చేతిలో డబ్బుపడితే శిశువు ఆడో, మగో చెప్పేస్తున్నారు. జంట నగరాల్లో నెలకు 15 నుంచి 20 వేల వరకు స్కానింగ్స్‌ చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌కు రెండు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ కోసం మరో మూడు వేలు అదనంగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది డబ్బు ఇచ్చి కడుపులో ఉంది పాపో, బాబో తెలుసుకొని అమ్మాయి అయితే అబార్షన్‌ చేయించుకుంటున్నారు.
 
ఎక్కడా... రికార్డులు ఉండవు...
స్కానింగ్‌, అబార్షన్‌ చేసే నర్సింగ్‌హోముల వైద్యులు మెడికల్‌ టర్నినేషన్‌ ప్రెగ్నెసీ 1971 (ఎంటీపీ) చట్టాన్ని అమలు చేయాలి. ఎందుకు స్కానింగ్‌ చేస్తున్నారో వివరాలు పొందుపర్చాలి. రికార్డులు నిర్వహించి డీఎంహెచ్‌ఓకు సమర్పించాలి. అలాగే అబార్షన్‌ చేయించుకున్న వాళ్ల పూర్తి వివరాలను రికార్డులో నమోదు చేయాలి. భార్యాభర్తల సంతకాలు ఉండాలి. ఎందుకు అబార్షన్‌ చేయాల్సి వస్తోందో వివరించాలి. చాలా నర్సింగ్‌హోములు ఇలాం టివి చేయడం లేదు.
 
చేతిలో పైకం పడితే చాలు
లింగనిర్ధారణ, అబార్షన్‌ చేస్తున్న సెంటర్ల వ్యవహారం రోజు రోజుకూ శ్రుతిమించి పోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. చేతిలో పైకం పడితే నిబంధనలకు పాతరేస్తున్నారు. అంతా బాగుందంటూ సెంటర్లకు సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. దాంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కొన్ని నర్సింగ్‌ హోముల్లో అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు చేయడం సాధారణమైపోయింది.
 
ఈ ఏడాదిలో ఎనిమిది కేసులే..
ఈ ఏడాది ఎనిమిది స్కానింగ్‌ సెంటర్లపైనే కేసులు నమోదయ్యాయి. అందులో ఆరు కేసులను ఫాలోఅప్‌ చేస్తున్నారు. ఈ సెంటర్లపై కూడా ఎవరో ఫిర్యాదు చేస్తేనే అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. అసలు ఎన్ని స్కానింగ్‌ సెంటర్లున్నాయి, అందులో ఎన్నింటికి అనుమతి ఉంది.. మిగితా వాటికి ఎందుకు లేదు.. రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉందా ...!! వంటి అంశాలను అధికారులు, సిబ్బంది పట్టించుకోడం లేదు.
 
గర్భస్థ శిశు పరీక్షా విధానాల చట్టం-1994 ఏం చెబుతుందంటే ..
లింగనిర్ధారణ చట్టవిరుద్ధమని గర్భస్థ శిశు పరీక్షా విధానాల చట్టం - 1994 చెబుతోంది. ఆ దృష్టితో పరీక్షలు చేయడం నేరమని స్పష్టం చేస్తోంది. లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై ఈ చట్టం ప్రకా రం కఠిన చర్యలు తీసుకోవచ్చు. స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేయడంతో పాటు యంత్రాలను స్వాధీనం చేసుకోవచ్చు. క్రిమినల్‌ కేసులూ నమోదు చేయొచ్చు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పది వేల రూపాయల వరకు జరిమానా విధించొచ్చు. అదే తప్పును మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముంది.
 
స్కానింగ్‌ సెంటర్లు పాటించాల్సినవి ఇవీ
  • ప్రతి సెంటర్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని డిస్‌ప్లే చేయాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్ష చేయకూడదు.
  • గర్భిణులకు సంబంధించిన డాక్టర్‌ స్లిప్‌ పెట్టాలి
  • ఆ గర్భిణీకి సంబంధించిన రికార్డులను రెండు సంవత్సరాల వరకు దాచాలి.
  • స్కానింగ్‌ సెంటర్లలోనిఎఫ్‌ ఫాలో వివరాలు పూర్తిగా నమోదు చేయాలి.
  • లింగ నిర్ధారణ అడగబోమని గర్భిణి వద్ద నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి.
 
స్కానింగ్‌ ఎప్పుడు చేయాలంటే

  • గర్భస్థ పిండానికి జన్యుసంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవడం కోసం.
  • గర్భిణి వయస్సు 35 సంవత్సరాలకు మించి ఉంటే...
  • రెండు, మూడుసార్లకంటే ఎక్కువగా గర్భస్రావం జరిగితే..
  • గర్భిణి హానికారక మందులు, అణుధార్మిక రసాయనాల ప్రభావానికి లోనైప్పుడు...

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov